18వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన కార్యక్రమం
మహబూబ్నగర్/నవోదయం : ఎన్హెచ్ఎం జేఏసీ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమం నేటితో 18వ రోజుకు చేరుకుంది. ప్రతిరోజూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో నేడు **“ఎన్హెచ్ఎం జీతాలు గంజి నీళ్లకే సరి”** అనే నినాదంతో రాగి అంబలి తయారు చేసి తాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రస్తుత వేతనాలతో కుటుంబ పోషణ సైతం భారంగా మారిందనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులు మాట్లాడుతూ తమ న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రధానంగా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే మహిళా ఉద్యోగులకు 180 రోజుల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, విధి నిర్వహణలో ఉన్న ఎన్హెచ్ఎం ఉద్యోగి మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించేలా ఆరోగ్య కార్డులు మంజూరు చేయడంతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు కోరారు.
ఎన్హెచ్ఎం జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజేష్, డాక్టర్ ప్రీతి, డాక్టర్ అభినయ్, ఏఎన్ఎంలు భారతి, మంజుల, మహేష్, బుచ్చిబాబు, యుగేందర్, వెంకటేష్, నవీన్, టైమ్ములు, జ్యోతి, శివ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
18వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన కార్యక్రమం
Quick Summary:
18వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన కార్యక్రమం

