ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన
పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం
ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీలో సీఎం ధర్నాలు: డీకే అరుణ
గోకఫసల్వాడలో మన్ కీ బాత్ వీక్షించిన భాజపా శ్రేణులు
దౌల్తాబాద్, నవోదయం: ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన, దార్శనిక పాలన అందిస్తున్నారని మహబూబ్నగర్ లోక్సభ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రధాని మోదీ 139వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆమె స్థానిక ప్రజలు, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు.
దేశాభివృద్ధికి మోదీ కృషి
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తయారవుతున్న స్థానిక ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, ప్రత్యేక వస్తువుల విశిష్టతను ప్రధాని ప్రజలకు పరిచయం చేస్తున్నారని డీకే అరుణ తెలిపారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పారని, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధాని నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఎదగడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని అన్నారు.
రాహుల్ గాంధీపై విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ వేదికలపై భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గతంలోనూ పలుమార్లు జరిగిందని గుర్తుచేస్తూ, ఈ అంశంపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
పరిహారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేత అన్యాయం
రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో రహదారుల విస్తరణ పేరుతో పేదల ఇళ్లను కనీస నష్టపరిహారం చెల్లించకుండా కూల్చివేయడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం చేయకుండా అభివృద్ధి పనులు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.
రహదారుల నిర్మాణంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే భాజపా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే గ్రామగ్రామాన పర్యటించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
పలువురు నాయకుల హాజరు
ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి, పూనంచంద్ లహోటి, పురపాలక సంఘం సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు సతీష్, బసవరాజు, కేశవరెడ్డి, శంకర్, బుగ్గప్ప, మురళీధర్, రాజశేఖర్, మహబూబ్ అలీ, రాఘవేంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం
Quick Summary:
<b>ప్రపంచం భారత్ వైపు చూసేలా మోదీ పాలన పరిహారం ఇవ్వకుండా పేదల ఇళ్ల కూల్చివేత దుర్మార్గం