కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన
పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి
మేడ్చల్ మల్కాజిగిరి/నవోదయం :
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని సర్వే నెం. 346 పరిధిలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’ పనులకు మంగళవారం ఉదయం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేయగా, జిల్లా ఇన్‌ఛార్జ్, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,స్థానిక శాసన సభ్యులు, బిఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ.వివేకానంద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లబ్ధిదారులైన మహిళల సమక్షంలో, వారి చేతుల మీదుగానే భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
* గాజులరామారం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ
*అత్యాధునిక హంగులతో 4 టవర్లు.. 480 ఫ్లాట్లు
గాజులరామారంలో మొత్తం 2.60 ఎకరాల విస్తీర్ణంలో, రహదారి విస్తరణ మినహాయించగా మిగిలిన 9,948 చదరపు మీటర్ల నికర స్థలంలో ఈ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశ కింద మొత్తం నాలుగు బ్లాకులను ‘స్టిల్ట్ + 10 అంతస్తుల’ ( ఎస్ +10) శైలిలో అత్యాధునికంగా నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 నివాస యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. కామన్ ఏరియాతో కలిపి ఒక్కో ఇంటి విస్తీర్ణం 528.58 చదరపు అడుగులుగా ఉండనుంది. గేటెడ్ కమ్యూనిటీ తరహాలోనే ఈ ప్రాంగణంలో నివాస సముదాయంతో పాటు పిల్లల ఆట స్థలం కోసం 758 చదరపు మీటర్లు, వాణిజ్య అవసరాలకు 2,190 చదరపు మీటర్లు, ఓపెన్ పార్కింగ్ కోసం 1,613 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. అంతేకాకుండా కాలనీ వాసుల రాకపోకల కోసం 6 మీటర్లు, 10 మీటర్ల వెడల్పాటి విశాలమైన అంతర్గత రోడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
* పారదర్శక ఎంపిక.. 12 నెలల్లోనే గృహప్రవేశాలు
ఈ గృహాల కేటాయింపులో ఎలాంటి పైరవీలు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానాన్ని అమలు చేశామని మంత్రులు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అందిన 7 వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించిన తర్వాత 5,200 మందిని అర్హులుగా గుర్తించామని, వారి సమక్షంలోనే బహిరంగ డ్రా పద్ధతిలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఆన్‌లైన్ ద్వారా కేటాయింపులు పూర్తి చేసి ఎవరికి ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ వచ్చిందో అక్కడికక్కడే సర్టిఫికెట్లు అందజేశారు. దాదాపు రూ. 48 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణాలను కేవలం 12 నెలల గడువులోనే పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గడువు కంటే ఒక నెల ముందుగా పూర్తి చేస్తే రూ. 48 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ. 96 లక్షల బోనస్ ఇస్తామని కాంట్రాక్టర్లను ప్రోత్సహించామని, నాణ్యతా ప్రమాణాలను లబ్ధిదారులే స్వయంగా వారానికోసారి పరిశీలించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.
* కోట్లాది రూపాయల విలువైన భూమి పేదలకే అంకితం
హైదరాబాద్ మహానగరంలో స్థలాల ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రులు తెలిపారు. కూకట్‌పల్లి, బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్ వంటి ప్రధాన ప్రాంతాలకు సమీపంలో ఉన్న గాజులరామారంలో రూ. వందల కోట్ల విలువ చేసే విలువైన భూమిని ప్రభుత్వం పేదల నివాసాల కోసం కేటాయించిందని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజల రాకపోకల సౌలభ్యం కోసం 40 అడుగుల రోడ్డును ఇప్పటికే 100 అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. కేవలం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అర్బన్ నియోజకవర్గాల్లో ఒక్కో చోట మొదటి విడతగా 480 ఇళ్లతో ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నామని, మొదటి విడతలో ఇళ్లు రాని మిగతా అర్హులందరికీ రాబోయే రెండు, మూడు, నాలుగు విడతల్లో తప్పకుండా ఇళ్లు కేటాయిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు.
* స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇళ్ల పేరిట తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఇళ్ల సముదాయాలలోని లబ్ధిదారులకు ఇండ్లను కట్టించి ఇవ్వడమే కాదు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు ప్రార్థన మందిరాలకు, వైకుంఠ ధామాల కోసం స్థలాలను కేటాయించి అభివృద్ధిపరిచేలా హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్, స్థానిక మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి పరచాలన్నారు.
Telangana
కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటి
Quick Summary:
కుత్బుల్లాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు శంకుస్థాపన పేదల సొంతింటి కల సాకారం దిశగా అడుగులు: మంత్రి పొంగులేటిమ

