‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి>
కేరళలో ఘనంగా అవార్డు ప్రదానం.. ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి
నిలంబూర్, సెప్టెంబర్ 25:
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డును స్వీకరించారు. కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వెలుపల నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘కేరళ నాకు ఎంతో ఆత్మీయమైనది’
కేరళతో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను కేరళకు వచ్చిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయమైన స్వాగతం లభించిందని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా కేరళకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేరళకు వచ్చినట్లు తెలిపారు.
కేరళ ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉండటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించడంలో కేరళకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం పేర్కొన్నారు.
ఆర్యదాన్ ముహమ్మద్ సేవలను స్మరించుకున్న సీఎం
ఆర్యదాన్ ముహమ్మద్ ఒక గొప్ప రాజకీయ నాయకుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని, వివిధ ముఖ్యమంత్రుల హయాంలో నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. కేరళ రాజకీయాల్లో ఆయన చాణక్యుడిలా వ్యవహరించారని పేర్కొన్నారు.
నిలంబూర్‌తో పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఆర్యదాన్ ముహమ్మద్ ఒక మహావృక్షంలా నిలిచారని సీఎం అన్నారు. తన జీవితమంతా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాడారని గుర్తుచేశారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాలి
ఆర్యదాన్ ముహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, లౌకిక స్ఫూర్తి, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్, కేరళ రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Quick Summary:
ఆర్యదాన్ ముహమ్మద్-2026’ అవార్డు అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి
