మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం
అత్యాచారం కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
2023 సంవత్సరంలో అడ్డాకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ గౌరవ 4వ అదనపు సెషన్స్ కోర్టు మరియు మహిళా కోర్టు న్యాయమూర్తి శ్రీ ఆఫ్రోజ్ అక్తర్ గారు గురువారం తీర్పు వెలువరించారు.
అడ్డాకల్ మండలం అడ్డాకల్ గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువతిని అదే గ్రామానికి చెందిన మద్దా కరుణాకర్ తండ్రి మద్దా రాములు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంటపడుతూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు 11-04-2023న అప్పటి అడ్డాకల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి భూత్పూర్ సీఐ రజిత రెడ్డి పర్యవేక్షణలో, ప్రస్తుతం అడ్డాకల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న మురళి, ప్రస్తుతం భూత్పూర్ సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ తదితర అధికారులు కేసు దర్యాప్తును సమర్థవంతంగా కొనసాగించారు.
కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి మెనూ శ్రీ గారు ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించారు. అలాగే కోర్టు డ్యూటీ అధికారి మహిపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, కోర్టు లైజన్ అధికారి విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ HGO రమేష్ తదితర పోలీసు సిబ్బంది కేసులో కీలకంగా వ్యవహరించారు.
పోలీసుల సమర్థ దర్యాప్తు, పటిష్టమైన ఆధారాల సమర్పణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనల ఫలితంగా నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,000 జరిమానా విధిస్తూ గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి మెనూ శ్రీ గారిని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల దర్యాప్తు, కోర్టు ప్రాసిక్యూషన్ ప్రక్రియను మరింత పటిష్టంగా కొనసాగించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు.
Telangana
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం
Quick Summary:
మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం