జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మహబూబ్నగర్, అక్టోబర్ 26 (నవోదయం): జడ్చర్ల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోతున్న ఘటనపై మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రికి నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.
ఆప్తులను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మృతదేహాలను గౌరవప్రదంగా అప్పగించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అయితే, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
గతంలోనూ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను కుక్కలు పీక్కుతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నప్పటికీ ఆసుపత్రి సేవలు, నిర్వహణలో ఆశించిన మార్పు కనిపించడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొందని లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Telangana
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Quick Summary:
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి